కేంద్రం కొత్త షాక్..

  • నవంబర్ 15 అమ‌ల్లోకి న‌యా రూల్స్

ఫాస్టాగ్‌ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇకపై హైవే పై ప్ర‌యాణించాలంటే జేబుకు చిల్లు ప‌డాల్సిందే. ఫాస్టాగ్‌ లేకుండా జాతీయ రహదారుల టోల్‌ గేట్ల వద్ద క్యాష్‌తో చెల్లిస్తే… రెట్టింపు ఫీజు కట్టాల్సిందే. నవంబర్ 15 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త నియమం ప్రకారం, టోల్‌ గేట్ల వద్ద ఫాస్టాగ్‌ లేకుండా ప్రయాణించేవారు అధిక మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయం ప్రధానంగా డిజిటల్ చెల్లింపులను, న‌గ‌దు ర‌హిత చెల్లింపుల‌ను ప్రోత్సహించడం, ముఖ్యంగా ఫాస్టాగ్‌ వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫాస్టాగ్‌ లేని వాహనదారులు చెల్లించాల్సిన టోల్ రుసుముకు సంబంధించి కేంద్రం రెండు విభిన్న విధానాలను ప్రకటించింది.

ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌ గేట్‌ వద్ద నగదు రూపంలో చెల్లిస్తే, సాధారణ టోల్ ఫీజుకు రెట్టింపు (2x) రుసుమును కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ యూపీఐ (Google Pay, PhonePe వంటివి) ద్వారా చెల్లిస్తే, 1.25 రెట్లు మాత్రమే చెల్లించాలి.

ఇక‌, ఫాస్టాగ్‌ ఉన్న వాహనాల్లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, ఏదైనా సిస్టమ్‌ లోపం కారణంగా టోల్‌ గేట్‌ వద్ద డబ్బు కట్‌ కాకపోతే, ఆ వాహనదారులు ఉచితంగా వెళ్లిపోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్‌ ప్లాజాల వద్ద జరిగే చెల్లింపుల్లో 98% ఇప్పటికే ఫాస్టాగ్‌ల ద్వారానే జరుగుతుండ‌గా.. మిగిలిన 2% మాత్రమే నగదు ద్వారా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త రూల్స్‌ ద్వారా ఆ 2% నగదు లావాదేవీలను కూడా డిజిటల్‌ రూపంలోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఫాస్టాగ్‌ యూజర్ల కోసం వార్షిక పాస్

మరో ముఖ్యమైన ప్రోత్సాహకంగా, ప్రభుత్వం గత నెలలో ఫాస్టాగ్‌ వినియోగదారుల కోసం ఒక వార్షిక పాస్‌ను (Annual Pass) కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు కార్లు, జీపులు, వాన్ల వంటి వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఈ వార్షిక పాస్ ధర రూ3,000గా నిర్ణయించారు అధికారులు. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్‌ ప్లాజాల క్రాసింగ్‌ల వరకు చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్‌ ప్లాజాలలో ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి గణనీయమైన టోల్ భారాన్ని తగ్గిస్తుంది.

Leave a Reply