నాయకుల విడుదలకు డిమాండ్..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్లలో భూదాన భూముల సమస్యపై నిరసన తెలిపిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు బట్టు ప్రసాద్, మెస్సు గోపాల్, బత్తిని సత్యం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వెలుగుమట్లలో భూదాన భూముల్లో గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్న వారిలో కొందరికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చి, మరికొందరిని నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. ఈ సమస్యపై శాంతియుతంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, కోల లక్ష్మీనారాయణ తదితరులను పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తెలిపారు.

ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పేదల పక్షాన నిలిచే నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.

ఫిబ్రవరి 24న వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 10 సంవత్సరాలుగా నివసిస్తున్న సుమారు 800 మంది నిరుపేదల గుడిసెలను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో కూల్చివేయడం అమానుషమని అన్నారు. ఈ చర్యలో భారీ పోలీసు బలగాల మోహరింపు, అధికారుల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

పార్టీ పోరాటాల ఫలితంగా కొందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా, మిగిలిన వారికి ఇవ్వకపోవడంతో నిరసన చేపట్టామని తెలిపారు. ఈ నేపథ్యంలో నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.

అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారందరికీ సమానంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల పక్షాన కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply