బెల్లంపల్లి నూతన ఏసీపీగా కిరణ్ కుమార్

బెల్లంపల్లి నూతన ఏసీపీగా కిరణ్ కుమార్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి డివిజన్ నూతన ఏసీపీగా కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఏసీపీ ఎ. రవికుమార్ డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయం నుండి బదిలీపై వచ్చిన కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెల్లంపల్లి డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తానన్నారు.
ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణం నెలకొనేలా సహకరించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏసీపీ కార్యాలయ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు నూతన ఏసీపీ కిరణ్ కుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల మెచ్చిన అధికారిగా ఎ. రవికుమార్

2024 ఫిబ్రవరిలో బెల్లంపల్లి ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన ఎ. రవికుమార్ సుమారు రెండేళ్ల పాటు ఈ డివిజన్‌లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. నిబద్ధత గల పోలీస్ అధికారిగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ ఆయన చూపిన చొరవను డివిజన్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్‌ఐగా కూడా ఎ. రవికుమార్ పనిచేసిన విషయం తెలిసిందే.
