Nellore | ప్రారంభ‌మైన రొట్టెల పండుగ – బారాషహీద్ దర్గాకు భారీగా త‌ర‌లివ‌స్తున్న భ‌క్తం జ‌నం

నెల్లూరు – నెల్లూరులోని ప్రసిద్ధ బారాషహీద్ దర్గా (bara shahid darga ) వద్ద ఏటా జరిగే రొట్టెల పండుగ (rottela festival ) నేడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సోమవారం గంధ మహోత్సవం (gandha Mahotsav ) , మంగళవారం రొట్టెల పండగ జరగనుంది. బారాషహీదుల సమాధులను దర్శించుకుని స్వర్ణాల చెరువులో (swrnala chruvu ) రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతారని భక్తులు విశ్వసిస్తారు.తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.

ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం భక్తులు భారీగా చేరుకుంటున్నారు. తమ మనసులోని కోరిక నెరవేరాలని ఆశిస్తూ, గతంలో కోరిక తీరిన వారి నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. దీని కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను మార్చుకుంటున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది.

15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు రావ‌చ్చ‌ని అంచ‌నా

రొట్టెలు పట్టుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పండగకు తరలివస్తారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. దర్గా ఆవరణలో షెల్టర్లు, క్యూ లైన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు, వైద్య శిబిరాలతో పాట, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు.

దర్గాకు వచ్చే రహదారులన్నీ రద్దీగా ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పండగకు రెండు రోజుల ముందు నుంచే వస్తున్న భక్తులు బారాషహీద్‌లను దర్శించుకుని స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలను మార్చుకుంటారు. రొట్టెల పండగ ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు.

రొట్టెల పండగ ఏర్పాట్లను మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెల్లూరుకు రానున్న మంత్రి నారా లోకేశ్​ దర్గాను సందర్శించనున్నారు.

రొట్టెల పండుగ ప్రాముఖ్యం …

రొట్టెల పండగ మత సామరస్యానికి ప్రతిబింబం. మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి బారాషహీద్‌ దర్గా వేదికగా 5 రోజుల పాటు రొట్టెల పండగ జరుపుకుంటారు. 40 ఏళ్ల కిందట ఒక్క రోజు మాత్రమే జరిగే ఈ పండగ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండగగా ప్రకటించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది రొట్టెల పండగ ఆదివారం ప్రారంభం కానుండగా, ఇప్పటికే యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

6 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు:
బారాషహీద్‌ల త్యాగనిరతిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం గంధ మహోత్సవం, రొట్టెల పండగ జరుగుతాయి. నెలవంక కనిపించిన 10వ రోజు సొందల్‌ మాలి, 11వ రోజు గంధం, 12వ రోజు రొట్టెల పండగ, 13వ రోజు తహలీల్‌ ఫాతెహాఖాని, 14వ రోజు పండగ ముగింపు ఉత్సవాన్ని జరుపుతారు. ఈ మేరకు జులై 6వ తేదీ నుంచి 10 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

బియ్యం, ఆకుకూరతో రొట్టెల పండగ:

పూర్వపు రోజుల్లో ఆకుకూర, బియ్యంతో రొట్టెల పండగ జరుపుకునేవారు. ప్రస్తుతం గోధుమ రొట్టెలు, బెల్లంతో దీనిని నిర్వహిస్తున్నారు. సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దర్గా పక్కనున్న స్వర్ణాల చెరువులో భక్తితో స్నానమాచరించి, కోరికల రొట్టెను భక్తులు పట్టుకుంటారు. తరువాత బారాషహీదులను దర్శించుకుంటారు. కోరికలు తీరిన భక్తులు, మరుసటి సంవత్సరం అదే రొట్టెను తీసుకొచ్చి వదులుతారు.

Leave a Reply