HOSPITAL | స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం

HOSPITAL | స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం
ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం – సెల్‌ఫోన్ లైట్లలో పరిశీలన
HOSPITAL | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి (ESI Hospital) నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అయితే, ఎంపీ పర్యటనకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ రాకకు ముందు నుండి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, స్థలంలో వెలుతురు, సూచనలు, సదుపాయాలు ఏవీ లేని పరిస్థితి ఏర్పడిందని అక్కడికి చేరుకున్న కార్యకర్తలు విమర్శించారు. ఇక అధికారుల నిర్లక్ష్యంతో చీకటిలోనే ఎంపీ వంశీకృష్ణ సెల్‌ఫోన్ లైట్ల సహాయంతో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ “కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం రామగుండం ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కావడం అత్యవసరమని సూచించారు. గత సంవత్సరం నుంచి కేంద్ర కార్మిక శాఖ మంత్రి (Union Minister Of Labour) మన్సూక్ మాండవీయ తో అనేకసార్లు చర్చించి, కేంద్రం నుండి అనుమతి తెచ్చుకున్నామనీ గుర్తుచేశారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అధికారులది అంగీకారయోగ్యం కాదని మండిపడ్డారు.
ఎంపీని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ (Muncipal Commissoner) అరుణశ్రీతో పాటు ఈఎస్ఐ అధికారులపై నినాదాలు చేస్తూ “ఎన్ని అడ్డంకులు వచ్చినా కార్మికుల సౌకర్యం కోసం ఆసుపత్రిని తప్పక తెస్తాం” అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
