MDK | రాహుల్, రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నీలం మధు

ఉమ్మడి మెదక్ బ్యూరో, మార్చి 19 (ఆంధ్ర ప్రభ): ఏళ్లుగా నిరీక్షిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్య, ఆర్థిక రంగాల్లో 42శాతానికి రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చరిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో టీపీసీసీ పిలుపుమేరకు అసెంబ్లీ లో బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ అగ్రనేతలు,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గార్ల చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం బీసీ కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేయడం ద్వారా యావత్ బీసీ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలు చేకూర్చాలని కొనియాడారు.

మరోవైపు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ఆ వర్గ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి 30 ఏండ్ల కలను సాకారం చేశారని కొనియాడారు. ఒకే రోజు రెండు చారిత్రాత్మక బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడం తో పాటు ఉభయ సభలలో వాటిని ఆమోదించడం ద్వారా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయాలు యావత్ భారతావనికే ఆదర్శంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రజల పక్షాన పనిచేస్తూ, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని మరోసారి రుజువైందన్నారు. ఈ రెండు బిల్లులు ఆమోదంతో భారత రాజకీయలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు. ఈ రెండు బిల్లులు ఆమోదంలో సహకరించిన ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *