విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత..

విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత..

అధికారులపై వృద్ధురాలు కారం చల్లి నిరసన…

విజయవాడ, ఆంధ్రప్రభ : నందిగామ మండలం అనాసాగరం గ్రామంకు చెందిన తులసి అనే వృద్ధురాలు సోమవారం విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో ఆందోళనకు దిగింది. తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని నేషనల్ హైవే విస్తరణలో తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు సరైన పరిహారం చెల్లించలేదని ఆమె ఆరోపించింది.

ఈ నేపథ్యంలో, పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తులసి, సమావేశం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధికారులపై కారం చల్లి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది వెంటనే స్పందించి వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

వృద్ధురాలు మాట్లాడుతూ, మూడేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు. మా పొలం తీసుకుని డబ్బులు ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, విషయం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply