నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత…

నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత…
జైనుల ప్రపంచ నవకార్ మహా మంత్ర దివస్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
జైన సంఘీయుల అభ్యున్నతికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని
తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో నవకార్ మహామంత్ర దివస్ పాల్గొన్న వేలాది మంది జైన సంఘీయులు
విజయవాడ, ఆంధ్రప్రభ : నవకార్ మహా మంత్రం పఠించినా, విన్నా మానసిక ప్రశాంతత లభిస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ప్రపంచ నవకర్ మంత్ర దివస్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్నికి వేలాదిమంది జైన్ లు, జైన్ సంఘ పెద్దలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ముందుగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి నమస్కరించి వేదికపై ఉన్న రాజ్ నమ్రతా శ్రీజీ ఆశీస్సులు తీసుకున్నారు. జైన్ కుటుంబ సభ్యులందరికీ ప్రపంచ నవకర్ మహా మంత్ర దివస్ శుభాకాంక్షలు తెలిపారు. జైన పెద్దలు, సోదర , సోదరీ మణులతో కలసి కొద్దిసేపు నవకార్ మహామంత్ర పఠనం చేశారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మహామంత్ర దివస్ వేడుకలలో పాల్గొని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇచ్చిన సందేశాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సైతం విన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ…. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో, సుమారు 9000 సెంటర్లలో ప్రపంచ నౌకార్ మహాతంత్ర దివస్ కార్యక్రమం ను ఏక కాలంలో నిర్వహించడం అభినందనీయం అన్నారు. విజయవాడలో వేలాది మంది జైన సోదరీ, సోదరులు మహామంత్ర దివస్ లో పాల్గొనడం ఓ పండుగ వాతావరణంను తలపిస్తోందన్నారు.
ఢిల్లీ నుంచి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సైతం అక్కడ వేడుకలలో పాల్గొని సందేశం ఇవ్వడం, విజయవాడలో తాను ఇక్కడ మహామంత్ర దివస్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నవకార్ మహా మంత్రం అనేది మనసుకి ప్రశాంతతను, స్థిరత్వాన్ని, ప్రతి ఒక్కరిలోనూ సమాన భావాన్ని ప్రసాదించే ఒక పవిత్ర శక్తి అన్నారు. పధానమంత్రి నరేంద్ర మోడీ జైన్ గురువుల ఆచారాలను పాటించడం వల్లే ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారని, మోదీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ మంత్రమే కారణమని తెలుస్తోందన్నారు.
అరిహంతులు, సిద్ధులు, ఆచార్యులు వంటి మహోన్నత గురువులు చూపిన బాటలో శాంతియుత సమాజంలో అహాన్ని వీడి నడవడమే నవకర్ మహా మంత్ర ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. బయట ఉన్న శత్రువుల కంటే మనలోని అహంకారం, కోపం, లోభితనం వంటి ప్రతికూల ఆలోచనలను జయించడమే నిజమైన విజయమని భగవాన్ మహావీరుడు బోధించారని, ఆ మార్గంను అనుసరించి జైనులు ధన్యత పొందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తన కోపాన్ని విడనాడి శాంతియుత భావాలతో పరోక్షంగా జైన్ మత సిద్ధాంతాలతో నడుస్తున్నారని, ప్రభుత్వ పరంగానూ జైనుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

విజయవాడ నగరాన్ని గొప్ప వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడంలో జైన్ సమాజం చేసిన కృషి మరువలేనిదన్నారు. పేద ప్రజల కోసం జైన్ సమాజం నిర్వహిస్తున్న విద్యా, వైద్య మరియు అన్నదాన కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవని, జైన్ సమాజం కోరిన విధంగా స్కూల్ , హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత మంత్రులను కలిసి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ శివనాథ్ తెలిపారు. విజయవాడ నగరం అభి వృద్ధి , ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో జైన సమాజం, జైన్ యువత చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జీఐటిఓ) విజయవాడ చాప్టర్ ఛైర్మన్ కమలేష్ జైన్ ఫోలోముతా మాట్లాడుతూ….విజయవాడ నగరంలో జైనులకు ఏ సమస్య వచ్చినా, తెలియజేయగానే ఆ సమస్య పరిష్కారంకు ఎంపి కేశినేని చిన్ని కృషి చేస్తున్నారని అందుకు జైన సమాజం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ నవకార్ మహామంత్ర్ దివస్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాధ్ సైతం పాల్గొనడం తమ కెంతో సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విజయవాడ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ప్రతినిధులు దినేష్ కుమార్ జైన్, మనీష్ కుమార్, రాకేష్ కుమార్ జైన్, మనీష్ కుమార్ జైన్, కుండమ్నాల్ గాంధీ, ప్రవీణ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు….
