Narayanapet | రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

Narayanapet | రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
- అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్
Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్(SP MD Riaz Hull Haq) అన్నారు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించినందున ప్రతీ సంవత్సరం ఈ రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు(Police Officers), సిబ్బంది కలిసి భారత రాజ్యాంగ పీఠికను పఠించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి దేశం గణతంత్రంగా మారిందని, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్. అంబేద్కర్(Dr. BR. Ambedkar) దేశానికి అమూల్యమైన బాటను చూపించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని, ఇది ప్రతి పౌరుడికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక హక్కులను కల్పిస్తుందని తెలిపారు.
రాజ్యాంగం ఇచ్చిన విలువలను కాపాడుకోవడం, పౌర హక్కులు(Civil Rights), బాధ్యతలను పాటించడం ప్రతీ ఒక్కరి కర్తవ్యమని అదనపు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, శివశంకర్, నరేష్, పురుషోత్తంతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
