Nandyala | హ‌ర్ష‌ణీయం..

Nandyala | హ‌ర్ష‌ణీయం..

  • రాయలసీమలో హార్టికల్చర్ హబ్
  • సాగునీటి సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి హార్టికల్చర్ మిషన్ (Horticulture Mission) కింద నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్వాగతించారు. శనివారం నంద్యాల లో సమితి కార్యాలయంలో కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

హార్టికల్చర్ హబ్ ద్వారా చేపట్టే మౌలిక సదుపాయాల నిర్మాణాలు రైతుల జీవనాన్ని మార్చగలవన్న ముఖ్యమంత్రి ప్రకటన రాయలసీమ ప్రజల్లో ఆశలు రేకెత్తించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) 2025-26 బడ్జెట్‌లో పూర్వోదయ పథకం కింద ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌ల అభివృద్ధికి, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని విమర్శించారు. ఇది హార్టికల్చర్ మిషన్ అమలుపై రాయలసీమ వాసుల్లో అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఏపీ విభజన తర్వాత అభివృద్ధి ప్రణాళికల్లో జరిగిన లోపాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారిందన్న భావన బలపడుతోందన్నారు.

రాయలసీమలోని అలగనూరు రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టుల (Project) పునరుద్ధరణకు అనేక సంవత్సరాలుగా నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పడిన లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన నిధుల కేటాయింపులో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. రాయలసీమలో దారుణమైన పరిస్థితులు రాకముందే ప్రభుత్వం మేల్కొని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా దృఢ నిర్ణయాలు తీసుకోవాలని దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రికి ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు యర్రం శంకర రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, ఏరువ రామచంద్రారెడ్డి, న్యాయవాది అసదుల్లా, మనోజ్ కుమార్ రెడ్డి, జానో జాగో కన్వీనర్ మహబూబ్ భాష, పట్నం రాముడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply