ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో : గత తొమ్మిదేళ్లుగా దారి దోపిడీలు.. చోరీలతో జనానికి చుక్కలు చూపించిన నలుగురు ముఠా సభ్యులను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.10.85 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నంద్యాల, కర్నూలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2016 నుంచి ఈ ముఠా చెలరేగి పోయింది.

దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కరు, దొరకరు సినిమా చూపించారు. ఇలా తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బండి ఆత్మకూరు మండలం నెమళ్లకుంట గ్రామానికి చెందిన చెంచు దాసరి, పాణ్యం మండలం పాణ్యంలోని చెంచు కాలనీ చెందిన బాపట్ల సత్య హరిశ్చంద్రుడు అలియాస్ మేకల హరిచంద్రుడు, బాపట్ల చిన్న హుసేని అలియాస్ పొట్టలోడు, గడివేముల మండలం కరిమద్దల గ్రామానికి చెందిన చెంచు దాసరి జమ్ములు అలియాస్ జంబులు ఒక దొంగల ముఠాగా ఏర్పడ్డారు.

ఈ ముఠా పాణ్యం, నంద్యాల చుట్టు పక్కల గ్రామాల్లో రాత్రి సమయాల్లో రోడ్డు పక్కన మాటు వేసి దారి దోపిడీలు చేశారు. ఇక తాళాలు వేసిన ఇళ్లను పసిగట్టి చోరీలకు పాల్పడ్డారు. ఇలా అపహరించిన సొమ్మును సమానంగా పంచుకొంటారు.

కేవలం నంద్యాల జిల్లాలోనే కాకుండా.. కర్నూలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ నేరాలకు పాల్పడ్డారు. 2016 నుంచి వీరి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి, అనేక ప్రాంతాలు తిరిగి, ఈ ముఠా కదలికలపై నిఘా పెంచారు.

ఈ స్థితిలో పాణ్యం మండలం పిన్నపురం కొండలలోని దుర్గం వాగు సమీపంలోని జలపాతం దగ్గర గుడారం వేసుకొని దొంగిలించిన బంగారు, వెండి నగలు, నగదు, రెండు బైకులు, నాలుగు మారణాయుధాలతో మకాం వేసిన నిందితులను పోలీసులు గుర్తించారు.

తక్షణమే అదుపులోకి తీసుని ఈ నలుగురినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 తులాల బంగారం ఆభరణాలు, 21 తులాల వెండి నగలు, రూ. 10,100 నగదు, రెండు బైకులు, నాలుగు పిడి బాకులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో మొత్తం సుమారు రూ.10.85 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల సీసీఎస్ సిబ్బంది సహకారంతో పాణ్యం సీఐ వి. కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ టీ. నరేంద్ర కుమార్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి కరుడుగట్టిన ఈ దొంగల ముఠాను పట్టుకున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ టీమ్ ను అభినందించారు.

ఈ కేసుల రికవరిలో ప్రతిభ కనబరచిన సిబ్బందిని జిల్లా ఎస్ పి అధిరాజ్ సింగ్ రాణా , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్.యుగంధర్ బాబు, సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి అల్ఫోన్స్ అభినందించారు. నగదు రివార్డును అందజేశారు.

Leave a Reply