Nalgonda| మూడేళ్ల‌లో ఎస్ఎల్‌బీసీ ప‌నుల పూర్తి చేస్తాం – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

న‌ల్ల‌గొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : రానున్న‌మూడేళ్ల‌లో ఎస్ఎల్‌బీసీ సొరంగం ప‌నులు పూర్తి చేసిన జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, జి .ఎడవెళ్లి గ్రామ చెరువు కు సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా జి .యడవల్లి చెరువు తూము ,ఇతర పనుల మరమ్మతుకు గాను కోటి రూపాయలను డి ఎం ఎఫ్ టి ద్వారా మంజూరు చేయడమే కాకుండా, బుధవారం నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

నాలుగువేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్ బిసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందని , అయితే అటువైపునుండి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి మూడు ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు.

ఎడ్ల‌వ‌ల్లిలో 80 మందికి ఇందిర‌మ్మ ఇళ్లు
ఎడవల్లి గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామ‌ని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనితొపాటు, 5 కోట్ల రూపాయలతో బీటి రోడ్లు, 30 లక్షల తో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎడవల్లి చెరువు మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కనగల్ ఆస్పత్రిలో గ్లూకోమా కంటి పరీక్షలకు అధునాతన యంత్రం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

జిల్లా ఆస్పత్రి మాదిరిగా కనగల్ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. కనగల్ మండల మహిళా సమాఖ్య సభ్యులకు అయిటి పాములలో లాగే సోలార్ విద్యుత్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు . ఏవైనా సమస్యలు ఉంటే మండల ప్రజలు తన దృష్టికి తీసుకు రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పద్మ, ఇంజనీరింగ్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply