నల్లగొండ జిల్లాలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సాయిగౌడ్, ప్రవీణ్లు మరో ముగ్గురు కలిసి కారులో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు నల్లగొండ జిల్లా పరిధిలోని ఏపీ లింగోటం వద్దకు రాగానే ఎదురుగా ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో సాయిగౌడ్, ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.