Munugodu | ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం

Munugodu | ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయామని ఇంట్లో కూర్చోకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జీడిమడ్ల నిర్మల, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో క్రైమ్ రేట్ అత్యంత తక్కువగా ఉన్న నియోజకవర్గం మన మునుగోడు నియోజకవర్గం అని, ఎన్నికల అప్పుడే పార్టీలు రాజకీయాలని ఎన్నికల తర్వాత అందరూ సోదర భావంతో కలిసి మెలిసి పనిచేసుకోవాల్సిందేనని అన్నారు.

సోదర భావ వాతావరణం గ్రామాల్లో నెలకొల్పేలా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రయత్నించాలన్నారు. ప్రతి పని ప్రభుత్వమే చేయాలంటే ఆలస్యం అవుతుందని గ్రామాల్లో ఆర్థికంగా బలపడిన వ్యక్తులు తమ గ్రామ అభివృద్ధి కోసం సమయం, నిధులు కేటాయించినట్లయితే గ్రామాల అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాలలో పేదరికం నిర్మూలించవచ్చని పిలుపునిచ్చారు. తమ సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లెంల ఆడపడుచును కొంపల్లి గ్రామ సర్పంచిగా గెలిపించినందుకు బ్రాహ్మణ వెల్లెంల గ్రామం తరపున వెదిరె పూలమ్మ పౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
