TG | సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ

  • ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్

రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. మోడీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. అస‌లు నరేంద్ర మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని రఘానందరావు అన్నారు. ముందు రాహుల్ గాంధీ ఏ కులమో చెప్పాలని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లంతా చరిత్రలో కలిసిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతగానితనం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. మోదీ 2002 వరకు ఉన్నత కులానికి చెందినవారని, తర్వాత బీసీ జాబితాలో చేరారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వేడీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

కులగణన సర్వేలో పాల్గొనని వారందరినీ సామాజిక బహిరష్కరణ చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఉందా అంటూ ప్రశ్నించారు. సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు.

బీసీల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి… తన కేబినెట్‌లో ఎంతమంది బీసీల‌కు స్థానం ఇచ్చారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో 17 మంది బీసీ మంత్రులు ఉన్నారని తెలిపారు. అయితే రేవంత్ కేబినెట్‌లో ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *