MP Kesineni Srinivas | జగన్‌వి అన్నీ అబద్ధాలే..

MP Kesineni Srinivas | జగన్‌వి అన్నీ అబద్ధాలే..

  • రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.925 కోట్ల దుర్వినియోగం
  • రాజధానిపై వక్రీకరణలు మానుకోవాలి
  • కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి
  • ఎంపీ కేశినేని శివనాథ్

MP Kesineni Srinivas | ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలే అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇకపై జగన్ చెప్పే అబద్దాల‌ను ఏమాత్రం నమ్మరని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వంలో రూ.925 కోట్లను అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించిన బాధ్యత కూడా జగన్ ప్రభుత్వానిదేనన్నారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో ప్రజలను మోసం చేసిన చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. రాజధాని అంశంలోనూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.

రాజధాని విజయవాడ–గుంటూరు సమీపంలోనే ఉందని, ప్రజలను గందరగోళానికి గురిచేయాలనే ఉద్దేశంతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మంగళగిరి–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపి మహానగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన అడుగులు వేస్తున్నారని తెలిపారు. జగన్ ప్రెస్‌మీట్‌లో చెప్పిన అబద్దాలు, అర్థసత్యాలేనని కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించే స్థాయికి వచ్చారని అన్నారు. బోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.

చరిత్రలోనే అత్యంత హీనమైన ఓటమి జగన్‌కు ఎదురైందని, వైసీపీ రాజకీయంగా చరిత్ర అయిపోయిందని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్లు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రశ్నలు వేయడం జగన్‌కు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని పేర్కొన్నారు. అమరావతి, విశాఖపట్నం, రాయలసీమలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.

Leave a Reply