ఉమ్మడి మెదక్ బ్యూరో : పచ్చటి సంసారంపై అనారోగ్యాల దెబ్బ పడింది. బాధలను భరించలేని తల్లి కూతుర్లు (Mother daughters) ఆత్మహత్య చేసుకున్న సంఘటన వర్గల్ మండలం గౌరారం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి…
గౌరారం గ్రామానికి చెందిన వెల్దుర్తి మంజునాథ్ (Manjunath) (35) భార్య కవిత (Kavitha)(32) తో కలిసి జీవిస్తున్నారు. కవిత పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో ఇబ్బందులతో జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంది. కాగా కవిత తల్లి భారతమ్మ (Bharatamma) (65) కూడా వారితో జీవిస్తుంది. మంజునాథ్ వివిధ రకాల పనులు చేస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. మంజునాథ్ అత్త భారతమ్మ గత కొంతకాలం నుంచి నరాల వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు చికిత్స జరుగుతుంది. ఈ క్రమంలో మంజునాథ్ గత నెలలో పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి బాధపడుతున్నాడు. ఈనెల 7న చికిత్స కోసం మంజునాథ్ హైదరాబాద్ వెళ్ళాడు.
ఈ క్రమంలో తల్లి భారతమ్మ, కూతురు కవితలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒకవేళ మంజునాథ్ కు ఏమైనా జరిగితే తమ కుటుంబం ఏమవుతుందోనని బెంగపడ్డారు. ఈ వేదన భరించలేక శుక్రవారం ఉదయం తల్లి కూతుళ్లు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని వీధిలో ఉన్న వారు ఆలస్యంగా గుర్తించి తలుపులు తెరిచేప్పటికీ వారిద్దరూ చనిపోయి ఉన్నారు. నోట్లో నుండి నురగ వస్తుంది. మంజునాథ్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వచ్చి చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.
మంజునాథ్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మంజునాథ్ కు 13 సంవత్సరాల కూతురు, 10సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయి ఏడుస్తున్న దృశ్యం గ్రామస్తులను కలిచివేసింది. శవాలను పోస్టుమార్టంకు పంపించినట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.