జాతీయ రహదారిపై రుధిరధారలు

జాతీయ రహదారిపై రుధిరధారలు
వెలికట్ట శివారులో రోడ్డు మరమ్మతు పూర్తికాక ప్రమాదాలు
ద్విచక్ర వాహనాలు జారిపడి 50 మందికి పైగా గాయాలు
తొర్రూరు, ఆంధ్రప్రభ : వరంగల్– ఖమ్మం జాతీయ రహదారి మృత్యుదారిగా మారుతున్నా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) అధికారులు స్పందించడంలేదు. దాని నిర్వహణ అధ్వానంగా మారుతోంది. రోడ్డు మరమ్మత్తులో భాగంగా ఇటీవల వెలికట్ట గ్రామ శివారులో మూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనుల నిర్వహణలో భాగంగా రోడ్ మిల్లింగ్ పేరిట పై పొరను తొలగించారు. సాధారణంగా హైవేలపై రోడ్డు ఎత్తు పెరగకుండా చూడటానికి లేదా పాత బీటీ పొర దెబ్బతిన్నప్పుడు కొత్తది వేయడానికి ముందు ఈ ప్రక్రియను చేపడతారు.
లేయర్ తొలగించినప్పటికీ పది రోజులుగా తిరిగి కొత్తవి వేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వెలికట్ట శివారు దాబా సమీపంలోని ఇటుకల బట్టి ఎదురుగా జాతీయ రహదారి లేయర్ తొలగించడంతో ఎగుడు దిగుడుగా ఉండి వాహనదారులు గాయాల పాలవుతున్నారు. ఇప్పటికీ సుమారు 40 మంది వరకు గాయాల పాలయ్యారు. సుమారు పదిమంది ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ . వేలల్లో సమర్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐదేళ్లకోసారి కొత్త లేయర్ వేయాల్సి ఉన్నా అధికారులు, నిర్మాణసంస్థ యజమానులు పనులు చేయట్లేదు. గుంతలు పడినప్పుడు మరమ్మతులు చేసి వదిలేయడంతో ప్రమాదాలకు కారణమవుతోంది.

రహదారి అధ్వాన పరిస్థితులకు వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం తోడవడంతో పలువురి ప్రాణాలు గాల్లోకలిసిపోతున్నాయి. జాతీయ రహదారి కావడంతో భారీ నుంచి అతి భారీ వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ జాతీయ రహదారి వెంట కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఈ లేయర్ తొలగింపు వల్ల ఏమరపాటుగా డ్రైవింగ్ చేసే ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. స్థానికుడు పడిదల మధుకర్ రావు మాట్లాడుతూ…జాతీయ రహదారి పై లేయర్ తొలగింపుతో వాహనదారుల ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.
పనులు నత్త నడకన సాగడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం తొరూరుకు వచ్చే వాహనదారులు కిందపడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎన్ హెచ్ అధికారులు స్పందించి పనులు సకాలంలో పూర్తి చేయాలని, ప్రమాదాలు నివారించాలని కోరారు.
