వినూత్న సాగుతో సుస్థిర ఆదాయం

వినూత్న సాగుతో సుస్థిర ఆదాయం
- ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి
- పీఎండీఎస్తో బహుళ ప్రయోజనాలు
- ప్రకృతి వ్యవసాయంతో నేలకు మనిషికీ ఆరోగ్యం
- ఆధునిక విజ్ఞానాన్నీ సద్వినియోగం చేసుకోవాలి
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు వినూత్న సాగు విధానాలను అనుసరించడం ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సుస్థిర ఆదాయం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా నేల సారాన్ని కాపాడటమే కాకుండా, మనుషుల ఆరోగ్యానికి కూడా భరోసా కల్పించవచ్చని, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
నగరంలోని ఏపీఏవోఎస్ అసోసియేషన్ భవనంలో పీఎండీఎస్, ప్రకృతి సాగు విధానాలతో ఎల్ నినో మిటిగేషన్పై జరుగుతున్న జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొన్నారు. సాగు ఖర్చులు తగ్గించి వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతులకు సుస్థిర ఆదాయం సాధ్యం కావాలంటే పీఎండీఎస్, ట్రేసబిలిటీ, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్) సర్టిఫికేషన్ వంటివాటిపై దృష్టిసారించాలని.. వీటిని రైతులకు చేరువచేసేలా చేయిపట్టి నడిపించాలని సూచించారు.
పీఎండీఎస్ ద్వారా ఉత్పత్తి అయ్యే పశుగ్రాసంతో పాలలో వెన్న శాతం పెరుగుతుందన్నారు. ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించి.. ఆ పరిస్థితులను ఎదుర్కొనేలా సాగు విధానాలతో ప్రోత్సహించాలని సూచించారు. దీన్ని ఒక సవాలుగా స్వీకరించి, అధికారులు రైతులకు సరైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. వినూత్న సాగు విధానాల అమల్లో జిల్లాను నెం.1గా నిలపాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ అరుణ, ఏటీఎంఏ పీడీ మాధవీలత, డీడీ వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జ్ డీపీఎం గోపీచంద్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు.
