అగ్నిమాపక దళానికి ఆధునిక శక్తి..

అగ్నిమాపక దళానికి ఆధునిక శక్తి..
- నేడు అత్యాధునిక ఫైర్ వాహనాల ప్రారంభం
- రూ.252.93 కోట్లతో ఫైర్ సర్వీసుల ఆధునీకరణ
- తొలి విడతలో 25 అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్లు సేవలకు
- 125 వాహనాలు మంజూరు.. స్పందన సమయం తగ్గింపే లక్ష్యం గా సేవలు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అగ్నిమాపక సేవలను సాంకేతికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలను ప్రారంభించింది. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ.. సేవలను మరింత విస్తృతం చేసే క్రమంలో అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వాహనాలను సమకూర్చింది. పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా రూపొందించిన ఈ వాహనాలు నేటి నుండి సేవలను అందించనున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.252.93 కోట్లతో అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా సమకూర్చుకున్న అత్యాధునిక వాహనాలు, పరికరాలను సీఎం చంద్రబాబు మంగళవారం లాంచనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వాహనాలు ఇందిరాగాంధీ స్టేడియంలో సిద్ధంగా ఉంచగా, నేడు అధికారికంగా సేవలకు అంకితం కానున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం..
ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ కోసం మొత్తం రూ.252.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వినియోగించనుండగా, ఇందులో కేంద్ర వాటా రూ.189.70 కోట్లు (75%), రాష్ట్ర వాటా రూ.63.23 కోట్లు (25%)గా ఉంది. ఈ నిధులను విభజిస్తూ 50% ఆధునీకరణకు, 30% విస్తరణకు, 15% రాష్ట్ర అవసరాలకు, 5% శిక్షణకు కేటాయించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర నిధులను 100 శాతం వినియోగించి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ఈ ప్రణాళిక అమలులో ప్రత్యేకతగా నిలిచింది.

అత్యాధునిక వాహన సామాగ్రి..
రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ సర్వీస్ విభాగానికి మొత్తం 125 వాహనాలు మంజూరు కాగా, తొలి విడతలో 25 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.18 కోట్లతో 25 అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్లు, రూ.10 కోట్లతో హైప్రెషర్ పంప్‌లతో 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో ఇన్‌ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో బీఏ సెట్ కంప్రెసర్లు, మొత్తం రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు ఇప్పటికే అగ్నిమాపక శాఖ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
మరింత చెరువుగా సత్వర సేవలు..
అగ్నిమాపక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా అందిస్తున్న ఈ వాహనాలు క్విక్ రెస్పాన్స్ వాహనాలు ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన వీధుల్లో వేగంగా చేరుకునేలా రూపకల్పన చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో అత్యవసర సేవల తీరు మారనుంది. అలాగే రబ్బర్ బోట్లు వరదలు, నీటి ప్రమాదాల్లో కీలకంగా ఉపయోగపడనున్నాయి. కొత్త ఫైర్ ఇంజన్లు రాష్ట్రంలోని అన్ని ఫైర్ స్టేషన్లకు దశలవారీగా పంపిణీ చేయబడటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సేవల అంతరాలు తగ్గే అవకాశం ఉంది. అగ్నిప్రమాదాల్లో తొలి స్పందన సమయం అత్యంత కీలకం. ఆధునిక వాహనాలు, పరికరాల వినియోగంతో స్పందన సమయం గణనీయంగా తగ్గి, ప్రాణనష్టం ఆస్తినష్టం తగ్గించే అవకాశాలు మెరుగుపడనున్నాయి.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా..
వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించి అత్యాధునిక వాహనాలను అందించడంతో ఈ వ్యవస్థ మరింత బలోపేతం అయింది. వాహనాల సమీకరణతో పాటు శిక్షణ, సాంకేతిక సామర్థ్యాల పెంపు, సమన్వయ వ్యవస్థ బలోపేతం జరిగితేనే పూర్తి ఫలితం సాధ్యమవుతుంది. క్యూ ఆర్ వి ఎస్ హైప్రెషర్ పంపులు, ఆధునిక రక్షణ పరికరాలు అన్ని కలిసి అగ్నిమాపక దళాన్ని మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా మారనున్నాయి.
