అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయం
బెల్లంపల్లి,ఆంధ్రప్రభ : అసెంబ్లీ సమావేశాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సీనియర్ దళిత నాయకుడు కడియం శ్రీహరిపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలను కించపరచడం సభా హక్కుల ఉల్లంఘనేనని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని వినోద్ కుమార్ మండిపడ్డారు.
తన 26 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. సభలో హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడం మానుకోవాలని హితవు పలికారు. 2014 నుండి జరిగిన మైనింగ్ అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సీబిసీఐడి విచారణను ఆయన పూర్తిస్థాయిలో సమర్థించారు. గత పదేళ్లలో జరిగిన అవినీతి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దళిత నేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పీకర్‌ను కోరారు.
