MLA | బెల్లంపల్లికి ‘అభివృద్ధి’ కళ..

MLA | బెల్లంపల్లికి ‘అభివృద్ధి’ కళ..
- రూ. 4.07 కోట్లతో పనుల జాతర!
- 19 వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం
- మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- పట్టణవ్యాప్తంగా ఎమ్మెల్యేకు ఘనస్వాగతం.. భారీ బైక్ ర్యాలీ
MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలోని 19 వార్డుల్లో యుఐడిఎఫ్, ఎంఎఫ్టి నిధులు రూ. 4 కోట్ల 7 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని బూడిదగడ్డ బస్తీ, ఏం సి ఏరియా పరిధిలోని 20, 22, 23 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు హన్మాన్ బస్తీ, బాబక్యాంపు బస్తీల్లోని 29 నుండి 32 వార్డుల వరకు రూ. 40 లక్షలతో పనులు చేపట్టినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో బెల్లంపల్లి పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే 28, 33, 34 వార్డుల్లో రూ. 40 లక్షలు, అలాగే అంబేద్కర్ నగర్‌లోని 3, 17, 18 వార్డుల్లో రూ. 1 కోటి 85 లక్షలతో భారీ ఎత్తున సి సి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు.
టేకులబస్తీ, పోస్టాఫీస్ బస్తీల మధ్య కూడా నూతన రహదారులు నిర్మిస్తామని, కాల్ టెక్స్, గాంధీ నగర్ బస్తీలలోని 10 నుండి 13 వార్డుల వరకు రూ. 45 లక్షలతో పనులు చేపట్టి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని స్పష్టం చేశారు.

అంతకుముందు బూడిదగడ్డ బస్తీ నుంచి హనుమాన్ బస్తీ మెయిన్ బజార్, టేకులబస్తీ మీదుగా గాంధీ నగర్ వరకు నిర్వహించిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్, ఉమాదేవి ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులు, డప్పు వాయిద్యాలు, పూల వర్షంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
టేకులబస్తీలోని రామాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళా నేత చింతల వసంత, నాయకులు కన్నూరి వెంకన్న, దెబ్బటి రమేష్‌లు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. పట్టణవ్యాప్తంగా అడుగడుగునా ప్రజలు ఎమ్మెల్యేకు నీరాజనాలు పలికారు.
మాజీ మున్సిపల్ ఛైర్మన్ మునిమంద స్వరూప రమేష్, గెల్లి రాజలింగు, లెంకల శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, మత్తమారి సూరిబాబు, గెల్లి జయరాం యాదవ్, చిలుముల శంకర్, కారుకూరి రామ్ చందర్, లెంకల సన్నీ, కొత్తపల్లి శ్యామ్, పోచంపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
