MLA | నిధులతో నిండుగా.. పల్లెలకు పండుగ..

MLA | నిధులతో నిండుగా.. పల్లెలకు పండుగ..
- నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి రూ.10 కోట్లు..
- షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటన..
- 6 మండలాలలోనూ అభివృద్ధి పనులు చేసేందుకు సంసిద్ధం..
- హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు
- సర్పంచులకు సంక్రాంతి పండుగ బహుమతి
MLA | షాద్ నగర్, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన నెల రోజుల్లోనే గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంక్రాంతి పండుగకు ముందు తీపి కబురు చెప్పారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నూతన సర్పంచులను ప్రోత్సహించే దిశగా తొలివిడత ఈ నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు.
త్వరలో అన్ని పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన నిధుల ద్వారా ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు, జిల్లేడు చౌదరిగుడా, కేశంపేట, నందిగామ మండలాలలో అభివృద్ధి పనులు అత్యవసరమైనవి గుర్తించి చేపడుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేస్తుందని స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ తరుణంలో ఈ నిధులు విడుదల కావడం గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణాన్ని తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందని ఆయన అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే పనుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కృష్ణారెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, అగునూరు బస్వం, కేకే కృష్ణ, పురుషోత్తం రెడ్డి, రాజు, ముబారక్, ఖదీర్, అశోక్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పల్లె ప్రగతి ఇలా..
తాజాగా విడుదలైన నిధులతో ఫరూక్ నగర్ మండలంలో చించోడు నుంచి వెంకటరెడ్డి పల్లి గ్రామం వరకు రూ.2.75 కోట్లతో బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. అదేవిధంగా కొందూరు మండలం గుంజల పహాడ్ నుంచి చౌడాపూర్ వరకు రూ. రెండు కోట్ల 53 లక్షలతో బీటీ రోడ్డు, తంగేళ్లపల్లి నుంచి చించోడు వరకు 50 లక్షలతో బీటీ రోడ్డు, సోమవారం పాడు నుంచి అయ్యవారిపల్లె వరకు సిడి పనులకు 54 లక్షలు కేటాయించారు.
జిల్లేడు చౌదరిగుడా మండలంలో పద్మారం నుంచి బోయగూడా వరకు బిటి రోడ్డు కోసం 1,43 కోట్లు, చౌదరి కూడా నుంచి వీరన్నపేట వరకు సిడి పనులకు 10 లక్షలు కేటాయించారు. కేశంపేట మండలంలో కాకునూరు నుంచి బయన్న గడ్డ వరకు సిడి పనులకు 12 లక్షలు, జడ్పీ రోడ్ నుంచి అవాజ్ మీద పడకల వరకు బీటీ రోడ్డుకు 82 లక్షల 50 వేలు, జడ్పీ రోడ్ నుండి రామేశ్వరం వరకు బీటీ రోడ్డుకు 66 లక్షలు కేటాయించారు. కొత్తూరు మండలంలో గూడూరు నుంచి పెద్దగుట్ట తండా వరకు సిడి పనులకు 18 లక్షలు, నందిగామ మండలంలో వీర్లపల్లి లో ప్రభుత్వ భవన నిర్మాణానికి 36 లక్షల 50 వేలు కేటాయిస్తున్నారు.
