MLA | పాలనా సౌలభ్యం కోసమే…

MLA | పాలనా సౌలభ్యం కోసమే…
- పంచాయితీల విభజన…
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
MLA | జి.కొండూరు, ఆంధ్రప్రభ : పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామపంచాయితీల విభజనకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయితీ విభజనపై గ్రామసభను నిర్వహించి, గ్రామస్తుల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ప్రజాభీష్టానికి అనుగుణంగా గ్రామాల విభజన, విలీనం జరుగుతుందన్నారు.
గ్రామసభలో ప్రజల అభిప్రాయాల ప్రకారం విభజన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు వెల్లడించారు. గ్రామంలో ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాలు, గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విభజన ప్రక్రియ జరుగుతుందన్నారు. కందులపాడు నుంచి వయా వెల్లటూరు మీదుగా గణపవరం వరకు విజయవాడ-విస్సన్నపేట బీటీ ప్రధాన రోడ్డు అభివృద్ధికి రూ.3.90 కోట్లు మంజూరైనట్లు స్పష్టం చేశారు. అతిత్వరలోనే టెండర్లు ప్రక్రియ పూర్తి కాగానే రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభింస్తారన్నారు. రహదారుల అభివృద్ధి చేసే క్రమంలో ఎక్కడా నిర్లక్ష్యం లేదన్నారు. నిధుల సౌలభ్యతను బట్టి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మైలవరం నియోజకవర్గంలో పి.ఆర్ రహదారుల అభివృద్ధికి రూ.11.42 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. మైలవరం నుంచి చంద్రాల వరకు వయా వెల్వడం రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మరో రూ.6కోట్లతో చంద్రాల ఊరి బయట వరకు అభివృద్ధి చేస్తామన్నారు. వంతెనల అభివృద్ధిపై ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేసినట్లు వెల్లడించారు. గ్రామస్తులు పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
