అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం

అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం
ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
అమరావతి,ఆంధ్రప్రభ : పార్లమెంట్ లో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం తెలపడం పై పెదకూరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బుధవారంఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు. గత ప్రభుత్వంఅమరావతిని నిర్లక్ష్యం చేసి అభివృద్ధిని అడ్డుకుందని, రైతుల త్యాగాలను పట్టించుకోలేదని తీవ్రంగావిమర్శించారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతిని తిరిగి పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు ఆమోదం రావడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు.అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా, ఆర్థిక అభివృద్ధికి కేంద్రబిందువుగా మారి లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుందని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములకు గౌరవం దక్కే రోజు ఇది అని ఇప్పటివరకుఅమరావతి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన వారికి ఈ నిర్ణయం గట్టి సమాధానం అని విమర్శించారు. ఇక అమరావతి రాజధాని అభివృద్ధిని ఎలాంటి దుష్టశక్తులుఅడ్డుకోలేవన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి కి, అలాగే రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
