పాలమూరు అభివృద్ధికి ప్రజల ముద్ర అవసరం…

పాలమూరు అభివృద్ధికి ప్రజల ముద్ర అవసరం…
49వ డివిజన్‌లో ప్రసన్న ఆనంద్ గౌడ్ ప్రచార హోరు
ధర్మం వైపే విజయం,కుట్రలకు తావులేదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్,ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): మహబూబ్‌నగర్ నగర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. 49వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ మేరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపుతో డివిజన్‌లో రాజకీయ ఉష్ణోగ్రత పెరిగింది. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న లక్ష్మీ ప్రసన్న ఆనంద్ గౌడ్‌ను ప్రజలు నిండు మనసుతో దీవించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు ఎదురైనా, ధర్మం వైపు నిలిచిన వారికే చివరికి విజయం వరిస్తుందని స్పష్టం చేశారు.పాలమూరు గడ్డపై జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలకు దిగుతున్నారని,గత పదేళ్లలో చేయలేని పనులను కేవలం రెండేళ్లలో వేల కోట్ల నిధులతో చేసి చూపించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధే తమ రాజకీయ అజెండా అని, ప్రజలే తమ బలమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా అభ్యర్థి భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ …49వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. సుమారు రూ.6 నుంచి రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ఇదివరకే డివిజన్‌లో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన రోడ్లు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, హైమాస్ట్ (ఐమాక్స్) లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, మంచినీటి సరఫరా వ్యవస్థ మరమ్మతులు పూర్తిగా చేపడతామని హామీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో లక్ష్మీ ప్రసన్న ఆనంద్ గౌడ్‌ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అప్పుడు 49వ డివిజన్ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
