మేమున్నాం…

మేమున్నాం…
- ఇటు మిషన్ వాత్సల్య ..
- అటు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అండ..
- బాధితులతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : కోవిడ్ ( COVID) మహమ్మారి కారణంగా 2020 లో తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద పిల్లలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య కార్యక్రమాలను అమలు చేస్తోందని, బాధితుల సాధికారత కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి (Collector G. Rajakumari) అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మిషన్ వాత్సల్య స్కీం ప్రధానమంత్రి పౌర సహాయం, అత్యవసర పరిస్థితులలో ఉపశమనం నిధి పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కింద ఆర్థిక సహాయాన్ని పొందిన బాధిత పిల్లలు, సంరక్షకులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమం, సాధికారత అధికారిణి లీలావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 9 మంది పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. వీరికి ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం (State Government) నుండి రూ.10 లక్షలు, కలిపి మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. బాధిత పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్ సాధికారత కోసం మిషన్ వాత్సల్య పథకం కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోవడం తీరని లోటు అయినప్పటికీ, కష్టాలను అధిగమించి విద్యలో రాణిస్తే మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పిల్లలకు ధైర్యం నూరిపోశారు. ఇకపై పిల్లలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా జిల్లా బాలల సంరక్షణ విభాగం లేదా ఐ సి డి ఎస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. బాధితుల కోసం ప్రభుత్వం అందించే అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సమాజంలో నిలదొక్కుకొని మంచి ప్రయోజకులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
అనాథలను ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి – జిల్లా కలెక్టర్
కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి కలుగుతోందని కలెక్టర్ తెలిపారు. నందికొట్కూరు మండలం వడ్డేమాను (Vaddemanu) గ్రామానికి చెందిన పి.రాజుకు రూ.1.50 లక్షల విలువైన వీడియో కెమెరా, గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన ఎస్. సబి సుల్తానా బి.ఫార్మసీ చదువుతున్నదని వివరించగా, ఆమె విద్య కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పాణ్యం మండలం (Panyam Mandal) బలపనూరు గ్రామానికి చెందిన సుప్రియ, సూర్యలక్ష్మిలకు గృహ నిర్మాణ నిధులు మంజూరు చేస్తామని, ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామానికి చెందిన ఎస్. సౌమ్యకు డిగ్రీ పూర్తి చేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మహేష్, మధుసూదన్, వంశీకృష్ణ, ఓబులేసు మొత్తం 9 మంది పిల్లలను పేరుపేరునా పిలిచి వారి పరిస్థితులను తెలుసుకున్న కలెక్టర్, మీకు ఎటువంటి సహాయం అవసరమైనా ఎప్పుడైనా కలెక్టర్ ను సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు వారి సంరక్షకులు పాల్గొన్నారు.
