Miss World | శిల్పారామంలో మిస్ వ‌ర‌ల్డ్ బ్యూటీస్ – బ‌తుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో సంద‌డి … ఫోటో స్టోరీ

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ వద్ద గల శిల్పారామం లోని ఇందిరా మహిళా శక్తి బజార్ లో గురువారం ఉదయం ప్ర‌పంచ సుంద‌రీమ‌ణులు సంద‌డి చేశారు. బజార్‌లో అడుగుపెట్టిన మిస్ వరల్డ్ పోటీదారుల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం క‌నిపించింది. ఒక్కో స్టాల్ చుట్టూ తిరుగుతూ సంద‌డి చేశారు. ఒక్కో మహిళ కథ, మహిళ మణుల కలలు, కష్టాలు, విజయాలు ఇలా ఎన్నో ఇమిడి ఉన్న ఉత్ప‌త్తుల‌ను ఆస‌క్తిక‌రంగా తిల‌కించారు.

ఇది కేవ‌లం బ‌జార్ కాదు..
ఈ సందర్భంగా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పోటీదారులను ఉద్దేశించి ప్రసంగించారు. “ఇది కేవలం బజార్ కాదు..ఇది శక్తి కేంద్రం, మార్పునకు చిహ్నం అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా పనిచేస్తోంది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛే నిజమైన స్వాతంత్ర్యం. ఇందిరా మహిళా శక్తి బజార్ ఆ స్వాతంత్య్రాన్ని బలపరుస్తోంది” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పురాతన నాగరికతల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని గుర్తు చేసిన ఆమె, కాల క్రమంలో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయినప్పటికీ, ఇప్పుడు తిరిగి అన్ని రంగాల్లో రాణిస్తుండటం ఎంతో గర్వకారణం అన్నారు. “మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం సాంస్కృతిక మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. అందం అంటే కేవలం రూపం కాదు..అది శక్తి, మేధస్సు, స్థితప్రజ్ఞతల సమ్మేళనంష అని సీత‌క్క అన్నారు.

స‌క్సెస్ స్టోరీలు తెలుసుకున్నారు…
బజార్‌ మొత్తం చూసిన మిస్ వరల్డ్ పోటీదారులు ప్రతి మహిళతో మాట్లాడారు. వారు చూసిన ప్రతి స్టాల్‌ వెనుక ఓ సక్సెస్ స్టోరీ గురించి ఆస‌క్తిక‌రంగా తెలుసుకున్నారు. 46 లక్షల మంది మహిళలు వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టిస్తున్నారు. వారు తీసుకున్న లోన్లు 100% తిరిగి చెల్లిస్తున్నారనీ మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారంతా బజార్‌ను సందర్శించిన తర్వాత ఇది నిజమైన శక్తి కేంద్రం అని కొనియాడారు.

సామాజిక మార్పు కోసం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం ఇందిరా మహిళా శక్తి బజార్ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ మహిళలు చరిత్రను తిరగరాస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ మహిళల శక్తి మీలో నింపుకొని సాధికారత , సామాజిక మార్పు సందేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు సెర్పు ఉద్దేశాలను లక్ష్యాలను సీఈవో దివ్య దేవరాజన్ వివరించారు. మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని విజయాల డాక్యుమెంటరీనీ ప్రదర్శించారు. మహిళా సంఘాల చే రూపొందించిన వస్తువులను మిస్ వరల్డ్ పోటీదారులకు బహుకరించారు.


బతుకమ్మ ఆడిన అందగ‌త్తెలు

శిల్పారామంలో ప్రపంచ సుందరీమణులు ఒక్కేసి పువ్వేసి చందమామా అంటూ బతుకమ్మ ఆడారు. చేతిలో పువ్వులను పట్టుకొని సంప్రదాయ తీరులో అందాల భామలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటకు సుందరీమణులు ఫిదా అయ్యారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్‌లోని ఐకానిక్ విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను సందర్శించనున్నారు. మిస్​ వరల్డ్​ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిసి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు తాజాగా కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే టాప్ 25 లిస్ట్‌ను సంస్థ విడుదల చేసింది. భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా పోటీలో ఉన్నారు. ఈ పోటీలు మే 10 వ తేదీన ప్రారంభమవ్వగా మే 31 వరకు జరగనున్నాయి. ఆ రోజే విన్నర్‌ని కూడా ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *