మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి…

మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి…

ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం…
రాష్ట్ర మంత్రులు… ఫరూక్.. బీసీ జనార్ధన రెడ్డి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావడమే సమాజ పురోగతికి పునాది అని రాష్ట్ర మంత్రులు మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మునిసిపల్ టౌన్ హాలులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు మనిషి జీవితాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్నారు.

విద్య లేనివాడు ప్రపంచంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేడని, ప్రతి కుటుంబం పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతిలో చాలా మంది మహిళలే ఉన్నారన్నారు.త కొన్నేళ్లుగా నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల యువతకు మంచి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. యువత సంఖ్య పెరిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, సమతుల్య జనాభా దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తోందన్నారు.

మహిళలు సమాజానికి ప్రేరణగా నిలుస్తారని, వారిని ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆడపిల్లల వివాహాల కోసం ‘షాదీ ముబారక్’ వంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన చారిత్రక నిర్ణయం తీసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు.

మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ వెంకట దాసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply