గద్వాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ కలకలం

గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గద్వాల పట్టణానికి చెందిన రుత్విక ఇండో ఇంగ్లీష్ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు.
అదే రోజు విద్యార్థిని స్కూల్‌కు హాజరు కాలేదని పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమై గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం విద్యార్థిని తల్లి కృష్ణవేణి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) సీసీటీవీ ఫుటేజ్‌లో విద్యార్థిని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని ఒక మహిళతో కలిసి వెళ్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
