శాంతిబాటలో మంత్రులు
హైదరాబాద్, కరీంనగర్ బ్యూరో ఆంధ్రప్రభ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud), మరో మంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు సద్దుమణగించడానికి పీసీసీ రంగంలోకి దిగింది. పీసీసీ(PCC) రంగంలోకి దిగిన వెంటనే ఇద్దరూ మంత్రులు మెత్తపడినట్లు తెలుస్తోంది.
ఇద్దరు కేబినెట్ మంత్రుల మధ్య వచ్చే విబేధాలు పెద్దవి కాకుండా, మరింత వైరల్ కాకుండా పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ (PCC Chief Mahesh Goud) రంగంలోకి దిగారు. మంత్రులు పొన్నం, అడ్లూరితో పీసీసీ చీఫ్ ఫోన్‌లో మాట్లాడారని సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు నేతలు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అడ్లూరిని ఉద్దేశించి తాను ఆ మాటలు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను ఎవరో కావాలనే వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు.
పొన్నంకు అల్టిమేటం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపటిలోగా క్షమాపణ చెప్పాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అల్టిమేటం ఇచ్చారు. అయితే తాను వ్యక్తిగతంగా దూషించలేదని, మంత్రి అడ్లూరికి కలవడానికి ప్రయత్నించినా దొరకడంలేదని మంత్రి పొన్నం అన్నారు. ఈ రోజు అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో అడ్లూరి మాట్లాడుతూ.. మాదిగలంటే అంతా చిన్నచూపా అని పరోక్షంగా మంత్రి పొన్నంను ప్రశ్నించారు. తనను అన్న మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోరితే ఆయనకు గౌరవం ఉంటుందని అన్నారు. దీనిపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Sonia Gandhi, Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తానని అన్నారు.
ఇదే విషయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు .. ” నేను దున్నపోతు అన్నప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.. కమ్యూనికేషన్ గ్యాప్(Communication Gap) తప్ప ఇంకేం లేదు ” అన్నారు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ అందుబాటులోకి రాలేదనీ పొన్నం చెప్పారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.