నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి..

నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి..

  • రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : గ్రామాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీరు అందించగలమని రాష్ట్ర మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని కొత్తపూడి గ్రామంలో సోమవారం నీటి భద్రత – నీటి సంఘాల బాధ్యత అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత నేడు మనందరిపై ఉందన్నారు. గ్రామాల్లో నీటి సంఘాలు క్రియాశీలకంగా పనిచేసి, చెరువులు, కాల్వల నిర్వహణను పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు.

నీటి సంఘాలు కేవలం పేరుకే పరిమితం కాకుండా, నీటి వృధాను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ​డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా విజయవంతం అవుతుందన్నారు. నీటి వినియోగంపై రైతులకు, ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, మండల పార్టీ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జ్ లంకే శేషగిరి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక నాయకులు, నీటి సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply