కడెం (ఆదిలాబాద్ జిల్లా) : గత రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. ఈ రోజు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు (Kadem Narayana Reddy Project) ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఇప్పటికే రూ.9 కోట్లతో మరమ్మతు పనులు పూర్తి చేశామని వెల్లడించారు.
వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి (Minister Jupalli Krishna Rao) తెలిపారు. భారీ వరదల కారణంగా పంట పొలాలు, నివాస గృహాలు, రహదారులు నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన అనంతరం సంబంధిత శాఖలు సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపుతాయని వివరించారు. అనంతరం బాధితులకు (victims) ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక మత్స్యకారుని (Fisherman) కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి అన్నారు.
కడెం ప్రాజెక్టు (Kadem project) పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపడతామన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ దండేవిట్టల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు పాల్గొన్నారు.