Minister | ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం

Minister | ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం
- క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
Minister | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచంలో శాంతి, ఐక్యత నెలకొనాలంటే ఏసుక్రీస్తు బోధనలు ప్రతిఒక్కరూ ఆచరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత ఏడాది తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఇదే కల్వరి చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆ రోజున ఏసుక్రీస్తు ఆశీస్సులు నాకు లభించాయి. అదే దీవెనల ఫలితంగా నేడు మంత్రి పదవిలో సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సన్మార్గంలో నడుచుకోవాలని, నిజాయితీ, సేవాభావంతో జీవించాలని ఏసుక్రీస్తు బోధించారు. ఈ క్రిస్మస్ పర్వదినాన ఆ బోధనలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఐక్యత, సహనం, ప్రేమతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈసందర్భంగా చర్చి పాస్టర్ ప్రవీణ్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని రవికుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ కార్కూరి రాంచందర్, గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ జక్కుల శ్వేత శ్రీధర్, బుచ్చయ్యపల్లి గ్రామ సర్పంచ్ జాడి మహేష్, కాంగ్రెస్ నాయకులు ముత్తే భూమయ్య, కనక రాజు, దుర్గం గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
