ఈరోజు తమ సొంత మైదానంలో లక్నోతో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సీజన్ తొలి అర్ధభాగంలో పరాజయాలతో సతమతమైన ముంబై… అద్భుతంగా పుంజుకుని బ్రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకుపోతోంది. కాగా, నేటి విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి ఎగబాకింది.
నేటి మ్యాచ్ లో తొలుత ముంబై బ్యాటర్లు చెలరేగగా… అనంతరం బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా (22/4) నాలుగు వికెట్లతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో మెరిసాడు. విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా.. కార్బిన్ బాష్ ఒక వికెట్ పడగొట్టాడు.
దీంతో 216 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన లక్నో… 161 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
లక్నో బ్యాటర్లలో ఎవరు కూడా బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కీలక బ్యాటర్లంగా స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ మిచెల్ మార్ష్ (34), నికోలస్ పూరన్ (27), ఆయుష్ బదోని (35), డేవిడ్ మిల్లర్ (24) పరుగులతో పోరాడే ప్రయత్నం చేశారు.
అంతకముందు ముంబై బ్యాటింగ్ లో.. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (58), సూర్య కుమార్ యాదవ్ (54) ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డారు. విల్ జాక్స్ (29) ఆకట్టుకోగా.. చివర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 25 నాటౌట్), కార్బిన్ బాష్ (10 బంతుల్లో 20) దూకుడుగా ఆడారు. దాంతో ముంబై స్కోర్ భారీగా నమోదైంది.
లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా… ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.