నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలి..

నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలి..
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జల మట్టాలను పెంచాలి.
శకునాలమ్మ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి.
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ చానెల్స్ లో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ నీటి చుక్కని సంరక్షించేందుకు రాబోయే 100 రోజులలో తీసుకోవలసిన చర్యలపై ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
జిల్లాలో గ్రామ, మండలాల వారీగా ఉన్న చెరువులు, కాలువలు, ఫీడర్ చానెల్స్ లను గుర్తించి వాటికి నీటి ప్రవాహం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని గుర్తించి నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగించడానికి, చెరువులలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచేందుకు పూడికతీత తదితర పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షపు నీటి పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు ప్రధాన లక్ష్యంగా ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
MGNREGS కింద శకునాలమ్మ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. చెరువుకు నీళ్లు వచ్చేలా, దాని పూడిక తీయడం, ఫీడర్ ఛానల్ (వంక)ను శుభ్రం చేసి చెరువుకు నీళ్లు వచ్చేలా పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. చెరువులను పునరుద్ధరించడం ద్వారా నీటి వనరులను మెరుగుపరచడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ డీఈ బ్రహ్మానంద రెడ్డి, ఏఈ రియాజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
