వాతావరణ శాఖ హెచ్చరిక
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి, నిశితంగా వేచి చూడండి, ప్రజలు ఇంట్లోనే ఉండాలి అని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్ దూకుడు పెరిగింది. గడిచిన 3గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 600 కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.
తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఈ రోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

