Medak | ఉద్యమాన్ని మలుపుతిప్పిన మైలురాయి దీక్షా దివాస్..

Medak | ఉద్యమాన్ని మలుపుతిప్పిన మైలురాయి దీక్షా దివాస్..
చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది
తెలంగాణ కోసం సావు నోట్లో తలపెట్టిన కేసీఆర్
14 ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం
నేటి యువతకు ఉద్యమ చరిత్రను చాటిచెప్పాలి
రాబోయే కాలంలో ఉద్యమ ద్రోహులకు బుద్ధి చెప్పాలి
మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పి మైలురాయిగా నిలిచిన దీక్ష దివాస్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి (Padmadevender Reddy), నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, జిల్లా నాయకులతో కలసి జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
తెలంగాణ (Telangana) తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఉద్యమం నాటి ఫోటో ఎగ్జిబిషన్లను ప్రారంభించి తిలకించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమైక్య పాలన నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001లో జెండా పట్టి ఉద్యమం ప్రారంభించడం జరిగిందన్నారు. 14 ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకోవడం జరిగిందని గుర్తుచేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలను ఏకం చేయడంతో పాటు రాజీనామాలు, రైలు రోకోలు, రాస్తారోకోలు చేపట్టి అన్ని వర్గాల కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో దీక్ష దివాస్ చేపట్టడం జరిగిందన్నారు.

దీక్ష జరిగే సమయంలో శ్రీకాంత చారీతో పాటు ఎంతో మంది అమరులయ్యారన్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లిన తర్వాత దీక్ష విరమణ చేయకుండా పట్టుదలతో సావు నోట్లో తలపెట్టినట్లు వివరించారు. కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో ఆయనకు ఏమైనా అయితే రాష్ట్రం అతలాకుతలమైతుందనే ఉద్దేశ్యంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. సమైక్య పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని, ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. నేటి యువతకు ఉద్యమ చరిత్రను చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు ఉద్యమ చరిత్ర తెలవాలని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటూ రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలను ఏకం చేసి ఉద్యమ ద్రోహులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దీక్ష దివాస్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరసనలు, ఆందోళనలు, వంటా వార్పు, ప్రాణ త్యాగాలు, మానవహారాలు వంటి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా దీక్ష దివాస్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇది చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమం బతకాలంటే పోరాటాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించుకొని తెలంగాణ జైత్ర యాత్రనా, కేసీఆర్ శవ యాత్రనా అని, రెండిట్లో ఏదోఒకటి జరగాలనే ఉద్దేశ్యంతో దీక్ష దివాస్ చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో అస్వస్థతకు గురికావడంతో మంత్రిగా ఉండి పెన్ డౌన్ చేశామని గుర్తుచేశారు.
తెలంగాణా ఉద్యమం కోసం పరోక్షంగా పాటుపడి తెలంగాణా తీర్మానాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. దీక్ష దివాస్ ప్రతి పౌరుడిని కదిలించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన దీక్ష దివాస్ గూర్చి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరం ఐక్యతతో ముందుకెళ్లి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్ప దీక్ష విరమించనని చెప్పి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించారన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ మాయమాటలతో అధికారంలోకి వచ్చి యువత, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
