ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
చల్లపల్లి – ఆంధ్రప్రభ : ఐఐటి, నీట్ ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే జాతీయస్థాయిలో బంగారు, రజత, కాంస్య వంటి ఏడు పతకాలు సాధించడం మిక్కిలి సంతోషంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్, కృష్ణాజిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న విద్యా వ్యవస్థలో భాగంగా ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ఐఐటి జేఈఈ నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో గ్రామీణ విద్యార్థులు పోటీని తట్టుకోవడానికి అడుగులు పడాలి అనే ఉద్దేశంతో 2025 26 విద్యా సంవత్సరం నుండి ఫౌండేషన్ కోర్సులు పాఠశాలలో ప్రారంభించిన చైర్మన్ గొర్రెపాటి రంగనాథ్ బాబు అభినందనీయులని అన్నారు.
భవిష్యత్తులో విద్యార్థినీ విద్యార్థులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ర్యాంకర్స్ ఒలంపియాడ్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన జాతీయస్థాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ స్టేజ్ 2 లో ఏడుగురు విద్యార్థులు బంగారు రజిత కాంస్య పతకాలు సాధించారు. కాసరనేని ఈషా (7వ తరగతి) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు పొంది బంగారు పతకం సాధించగా, స్నేహితా వీరంకి, రూపేష్ సాయి గుమ్మడి (6వ తరగతి) నాగ దివ్య మట్టా, తనుష్ వెంకట సాయి పిల్లి (8వ తరగతి) జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు పొంది రజత పతకం సాధించారు.
సుదీపా గుమ్మడి (8వ తరగతి) ఎస్తేరు రాణి కొడాలి (9వ తరగతి) జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు పొంది కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కరస్పాండెంట్ గొర్రెపాటి రామకృష్ణ, ప్రిన్సిపల్ నాగళ్ళ భీమారావు పతకాలు సర్టిఫికెట్స్ అందజేసి శుభాభినందనలు తెలియజేశారు.
