మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసుల మెరుపు

మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసుల మెరుపు

బంగారం, వెండి, కాంస్య పతకాలతో సత్తా

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర స్థాయి మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసు క్రీడాకారులు ప్రతిభ చాటుతూ పతకాల పంట పండించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 30, 31 తేదీల్లో జరిగిన పోటీలలో పాల్గొన్న ఆర్‌ఎస్సై పి.ఆర్. మహేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్‌లు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు గౌరవం తీసుకువచ్చారు. విజేతలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను సన్మానించి, మెడల్స్ అందజేసి ప్రోత్సహించారు.

ద్వంద్వ బాధ్యతల్లో ప్రతిభ..

పోలీసు విధుల్లో ఒత్తిడి మధ్య కూడా క్రీడల్లో రాణించడం ప్రశంసనీయం అని ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరింత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. మహేశ్వర రెడ్డి రికార్డు పరుగులు ఆర్‌ఎస్సై పి.ఆర్. మహేశ్వర రెడ్డి 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, 1500 మీటర్లలో వెండి పతకం సాధించారు. గత ఐదేళ్లుగా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిరంతరం పాల్గొంటూ చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటారు.

శివకుమార్ జంప్‌తో కాంస్యం..

కర్నూలు ట్రాఫిక్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ శివకుమార్ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించారు. గతంలో సౌత్ జోన్ నేషనల్స్, కేరళ జూనియర్ నేషనల్స్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచారు.

జాతీయ స్థాయిపై దృష్టి..

ఇద్దరూ త్వరలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.

Leave a Reply