బాసర, ఆంధ్రప్రభ : బాసర మండలం దోడపూర్ గ్రామంలో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని హజిని గ్రామానికి చెందిన మాధవి (వయస్సు 23)కి, దోడపూర్ గ్రామానికి చెందిన కర్మానే మనోజ్తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, మాధవి భర్త మనోజ్ మద్యానికి బానిసై, అదనపు కట్నం కోసం నిత్యం మద్యం తాగి వచ్చి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఎస్సై దయాల్ సింగ్ తెలిపారు.
భర్త వేధింపులు భరించలేకపోయిన మాధవి, గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి తండ్రి రామచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

