- దసరా దర్బార్‌లో అమిత్‌షా..
రాయ్‌పూర్, ఆంధ్రప్రభ : ఆయుధాలు వీడి లొంగిపోతే ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందని మావోయిస్టులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మరోసారి పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన దసరా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతేనే ప్రభుత్వం వారిని అంగీకరిస్తుందని స్పష్టం చేశారు. లొంగిపోవడానికి ముందుకొచ్చే వారికి పునరావాసం, సౌకర్యాలు, వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టుల ప్రభావం నుండి పూర్తిగా విముక్తం చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. శాంతి చర్చల పేరుతో లేఖలు రాసినా ప్రయోజనం లేదని, చర్చలకు ముందుకొచ్చే ముందు తప్పనిసరిగా ఆయుధాలు వదిలేయాలన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని గుర్తుచేసిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
మావోయిస్టుల అడ్డంకులు తొలగిన తర్వాత ఆ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతమవుతుందని స్థానికులకు హామీ ఇచ్చారు. 2014 నుంచి 2024 మధ్య మావోయిస్టు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాల మరణాలు 70 శాతం, పౌరుల మరణాలు 85 శాతం తగ్గాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 10,500 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇకపై కూడా లొంగని వారిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటాయని అమిత్ షా హెచ్చరించారు.