Mandali Buddha Prasad | రైతులు సహకరించాలి..
Mandali Buddha Prasad, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్టు ద్వారా మీ భూమి – మీ హక్కు నినాదంతో చేపట్టిన నాలుగో విడత రీ – సర్వే కార్యక్రమం కర పత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఇంచార్జి తహసీల్దార్ అవనిగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో అవనిగడ్డ, మోదుమూడి రెవిన్యూ గ్రామాల పరిధిలో రీ-సర్వే కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అవగాహనా సదస్సు, ర్యాలీ, మానవ హారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఓలు కళ్లేపల్లి వేణు, పెండ్యాల చంద్రమోహన్, బచ్చు నాగ వాసంతి, సిబ్బంది పాల్గొన్నారు.

