కోతుల భయంతో కిందపడి వ్యక్తి మృతి..

కోతుల భయంతో కిందపడి వ్యక్తి మృతి..

  • కోతులు వెంబడించడంతో కాళ్లు జారి కింద పడ్డ వ్యక్తి
  • చికిత్స పొందుతూ మృతి
  • పండుగ పూట పత్తిపాకలో విషాదం

శాయంపేట, ఆంధ్రప్రభ : మండలంలోని పత్తిపాక గ్రామంలో కోతులు వెంబడించడంతో భయంతో పై అంతస్తు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పండుగ రోజు ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, పత్తిపాక గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ తడుక కరుణాకర్ (51) ఇంటి కింది భాగంలో పనులు చేస్తుండగా, ఇంటి పక్కనే ఉన్న గొల్లపల్లి భాస్కర్ పై అంతస్తు గదిలోకి కోతులు వెళ్లాయని తెలిపారు. దీంతో కరుణాకర్ వెంటనే పై అంతస్తుకు వెళ్లి కోతులను తరిమేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కోతులు ఒక్కసారిగా అతని వైపు రావడంతో భయంతో తప్పించుకునే ప్రయత్నంలో కాళ్లు జారి పై అంతస్తు నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన భాస్కర్, కరుణాకర్ భార్య వరలక్ష్మికి సమాచారం అందించగా, ఆమె వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం కరుణాకర్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

మృతుడి భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కరుణాకర్ మృతితో పత్తిపాక గ్రామంలో విషాదం నెలకొంది. పండుగ రోజు ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

Leave a Reply