- మంత్రి వాకిటి లలితా శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ: జూరాల బ్యాక్ వాటర్ ముంపున కష్టపడుతున్న అనుగొండ గ్రామానికి పునరావాసం ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చూపాయని గుర్తించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం స్థానికంగా 750 కోట్ల రూపాయలు కేటాయించి అనుగొండ నూతన పునర్వాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అని మంత్రి సతీమణి వాకిటి లలితా శ్రీహరి తెలిపారు.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని నల్గొండ గ్రామంలో పర్యటించిన ఆమె, గ్రామ వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులను, స్థానిక వర్గాలను కలసి సభ నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంధ్య ఆంజనేయులను సర్పంచ్‌గా గెలిపించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
వాకిటి లలితా శ్రీహరి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పునరావాస పనులు పెండింగ్లోనే ఉండిపోయాయని, సీఎం శ్రీహరి ప్రత్యేక చొరవతో పునర్వాసం ఏర్పాటుకు చర్యలు చేపట్టారని, అందుకు 750 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంతే కాక, భవిష్యత్తులో మరిన్ని నిధులు కూడా గ్రామానికి కేటాయించనున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వాలు చేయని పనిని ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తోందని గుర్తు చేశారు.
వీటితో పాటు, పునర్వాస కేంద్రం ఏర్పాటుతో పాటు సబ్‌స్టేషన్‌ను కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సంధ్య ఆంజనేయులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామ అభివృద్ధికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అధ్యక్షులు గడ్డంపల్లి హనుమంతు, మాజీ గ్రామ సర్పంచ్ గడ్డం రమేష్, సర్పంచ్ అభ్యర్థి సంధ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

