మంత్రానుభవం
సాధారణంగా మనం దేవాలయాలను సందర్శించేటప్పుడు, గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ని ముందుగా చూడడానికి ప్రాధాన్యతనిచ్చి తహతహలాడుతుంటాం. దేవుడి రూపాన్ని కళ్ళారా చూశాక సంతృప్తి చెందుతాము. మనసు విప్పి ప్రార్థించి సమస్యల గోడు వెళ్లబోసుకుంటాం. నమ్మకాన్ని గుండెలనిండా నింపుకొని గుడినుంచి బయటికి వస్తాం. దేవుడి ముందు కళ్ళు మూసుకోవద్దని, తనివి తీరా చూడాలని కొందరు సిద్ధాంతులు సెలవిస్తుంటారు. భక్తులు ఎక్కువగా దేవుడి ముందు కళ్ళు మూసుకొని ప్రార్ధిస్తూ ఉంటారు.
అయితే బెంగళూరులో ఉన్నటువంటి ఓ ”ఇస్కాన్” దేవాలయంలో దైవదర్శనం మాత్రం ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు, అక్కడ భక్తులని ముందుగా గర్భగుడిలోకి అనుమతించరు. గర్భగుడిలోకి ప్రవేశించే దారిలో ఓ చిన్న మండపం కట్టారు. ఆ మండపంలో 108 పలకలు (అడుగులు) ఉంటాయి. మండపం పైకప్పుకి స్పీకర్ అమర్చి ఉంటుంది. భక్తులు ముందుగా ఈ మండపం లోని 108 పలకల మీద అడుగులేస్తూ, ఒక్కో అడుగుకీ, ఒక్కో మంత్రం హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే పైన స్పీకరులో వినబడుతున్న ఆ మంత్రానికి అనుగుణంగా పఠిస్తూ, తరువాత గర్భగుడి దర్శనం చేసుకోవాలి. ఆ మండపం పక్క గోడ మీద ఓ బోర్డు ఉంటుంది. 108 సార్లు ఆ మంత్రాన్ని పఠించడానికి 10 నిముషాలు పడుతుంది. ఆ పది నిముషాల్లో ఆ మంత్ర ప్రభావం వెల్లడి అవుతుంది. మొదట, అలవాటులేని భక్తులకు కొత్తగా అనిపించి, నవ్వు వచ్చినా, మంత్ర పఠనం మొదలై పూర్తయ్యేలోపు గొప్ప అనుభూతికి లోనవుతారు. ఆ నవ్వు అలా ఆగిపోయి తాదాత్మ్యం చెందుతారు. శరీరం ఒక్కసారిగా, బస్తాల నెత్తే స్ప్రింగ్ లాగా, పైకి తేలిపోయినట్లనిపిస్తుంది. సముద్రం మధ్యలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. 108 సార్లు అయిపోయాక, ఆ సంఖ్య ఇంకా చాలదనిపిస్తుంది. ”శ్రీరామ నీ నామ మెంతో రుచిరా” అన్న అనుభవానికి లోనవుతాము. ఆపై ఇంకా దేవుడి దర్శనం అవసరం లేదనిపిస్తుంది. ఒక్కసారిగా లోకమంతా మంచితనంతో నిండినట్లు, సుందరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చెప్పనలవి కాని అనుభవానకి లోనవుతాం. మనసంతా సానుకూల దృక్పథంతో నిండిపోతుంది. అప్పట్నుంచి కనీసం ఓ పది నిముషాలైనా ఆ మంత్రాన్ని పఠించాలని అనిపిస్తుంది. ఇది స్వీయ మంత్రానుభవం.
మంత్ర పఠనానికి, ప్రపంచ శాంతికి మధ్య సంబంధం కుదురుతుందనడానికి ఈ మంత్ర పఠనానంతరం తర్వాత ఏర్పడిన సానుకూల దృక్పథమే రుజువు అనిపిస్తుంది. భక్తులకు ‘ఇస్కాన్’ వారి రోజులో ఓ పది నిముషాల హరే రామ మంత్ర ప్రదర్శన లోకంలో శాంతిని నెలకొల్పుతుందనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో, యుద్ధాల బారిన పడిన ఇరు దేశాలైన రష్యా, ఉక్రైన్‌ల నుంచి వచ్చిన భక్తులు శాంతి ప్రార్ధనలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా ఆధ్యాత్మికతాచరణ, జాతి రంగు భేదాలని మించి మానవుల్లో సామరస్య శాంతి మార్గాలను నెలకొల్పుతుంది అనడానికీ ఆధ్యాత్మికత ఓ మంచి ఉదాహరణ అని కూడా వార్తలు వెలువడ్డాయి. ఓం శాంతి.
- ఒబ్బిని