- టైటాన్స్ కు తొలి ఓటమి..
- టాప్ 3లో లక్నో
లక్నో వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఓటమిని రుచి చూసింది. లక్నో సొంత మైదానంలో లక్నోను ఢీకొన్న గుజరాత్… 6 వికెట్ల తేడాతో తొలి ఓడి టోర్నమెంట్‌లో ఓటమిని చవిచూసింది.
అయితే గుజరాత్ దూకుడుకు బ్రేకులేసిన లక్నో.. పాయింట్ల పట్టికలో 6 నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఈ ఓటమితో గుజరాత్ రెండో స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచ్ లో 181 పరుగులతో ఛేజింగ్ కు దిగిన లక్నో దంచేసింది. టాపార్డర్ బ్యాటర్లు విరుచుకుపడటంతో.. గుజరాత్ పై లక్నో ఈజీ విక్టరీ నమోదు చేసింది. ఓపెనింగ్ ద్వయం ఐడెన్ మార్కరం – కెప్టెన్ రిషబ్ పంత్ కలిసి పవర్ ప్లే లో 61 పరుగులు బాదారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 38 బంతుల్లో 65 పరుగులు జోడించారు.
రిషబ్ పంత్ (21) ఔటన తరువాత.. ఐడెన్ మార్కరం (31 బంతుల్లో 58), నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61) హాఫ్ సెంచరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖర్లో ఆయుష్ బదోని (28 నాటౌట్) రాణించగా.. అబ్దుల్ సమద్ (2) నాటౌట్ గా నిలిచాడు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా… రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకముందు.. గుజరాత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్.. 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56), కెప్టెన్ శుభమన్ గిల్ (38 బంతుల్లో 60) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ కలిసి 73 బంతుల్లో తొలి వికెట్ ను 120 పరుగులు సాధించారు.
అయితే, పుంజుకున్న లక్నో బౌలర్లు వరుసగా వికెట్లు తీసి గుజరాత్ భారీ స్కోరు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లు స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. ఫలితంగా గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు సాధించింది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా, దిగ్వేష్, అవేష్ ఖాన్ లు ఒక్కో వికెట్ తీశారు.