మోడీ ప్రభుత్వ వైఫల్యంతోనే చమురు సంక్షోభం

మోడీ ప్రభుత్వ వైఫల్యంతోనే చమురు సంక్షోభం
మునుగోడు, ఆంధ్రప్రభ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యాల వల్లే దేశంలో చమురు సంక్షోభం ఏర్పడిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజ రామచంద్రం విమర్శించారు. అమెరికా,ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై జరుపుతున్న దాడులను నిలిపివేయాలని, పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుజ రామచంద్రం మాట్లాడుతూ దేశంలో నెలకొన్న ఇంధన సంక్షోభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టి లేని విధానాల ఫలితమని అన్నారు. విదేశాంగ విధానాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావాన్ని దేశ ఇంధన భద్రతపై అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వినియోగదారులను రక్షించాల్సిన ప్రభుత్వం భారాన్ని పేద, మధ్యతరగతి ప్రజలపై మోపుతోందన్నారు.
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచడం తీవ్ర భారం మోపిందన్నారు. అనేక ప్రాంతాల్లో గ్యాస్ లభ్యత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బిలాలు మండల కార్యవర్గ సభ్యులు బండమీది యాదయ్య, చలిమిడి సర్పంచ్ దుబ్బ వెంకన్న, ఈ.కైలాస్, ఉప్పునూతల రమేష్, మునుగోటి దయాకర్, ఎం.పాండు, కాయిత వెంకన్న, బెల్లం శివయ్య, గోస్కొండ లింగయ్య, ఆనగంటి నరసింహ, ఎన్.అశోక్, బండార్ శంకర్, కురుమర్తి ముత్తయ్య, పాలకూరి యాదయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
