AP | ఫిట్‌నెస్ భారం భరించలేం…

AP | ఫిట్‌నెస్ భారం భరించలేం…

  • చార్జీల పెంపు రద్దు చేయండి..
  • ముఖ్యమంత్రికి లారీ యాజమానుల విజ్ఞప్తి

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రస్థాయి రహదారి భద్రతా మండలి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దడం, క్రాష్ బారియర్ల ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలపై వివిధ రంగాల ప్రముఖులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రవాణాశాఖ, రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (సౌత్ జోన్) ఉపాధ్యక్షుడు వై.వి. ఈశ్వరరావు మాట్లాడుతూ… వాహనాల ఫిట్నెస్ చార్జీల పెంపును రద్దు చేసి పాత రేట్లు కొనసాగించాలని కోరారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం వాహనాల తయారీ తేదీ ఆధారంగా ఫిట్నెస్ చార్జీలు భారీగా పెంచిందని, లోగడ రూ.1,340 ఉన్న ఫిట్నెస్ ఫీజును 20 సంవత్సరాలు దాటిన వాహనాలకు రూ.33,000కి పెంచడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే 10 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ చార్జీల పెంపు రవాణా రంగానికి భారంగా మారిందని అన్నారు. ఈ వాహనాలను ఎక్కువగా డ్రైవర్లే కొనుగోలు చేసి స్థానికంగా నడుపుతూ ఉపాధి పొందుతున్నారని, ముఖ్యంగా రైల్వే గూడ్సు, గిడ్డంగులు, పోర్టుల మధ్య సరుకుల రవాణాకు వీటిని వినియోగిస్తారని తెలిపారు. ఒక్కసారిగా ఫిట్నెస్ ఛార్జీలను రూ.32,000కు పెంచడం వల్ల వాహనదారులు కుటుంబ పోషణలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెంచిన ఫిసును వెంటనే రద్దు చేసి పాత రేట్లను అమలు చేయాలని కోరారు.

Leave a Reply