న్యూ ఢిల్లీ – వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు బుధవారం లోక్‌సభ ముందుకు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింల హక్కుల్ని కాలరాసే బిల్లుగా అభివర్ణిస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇదిలా ఉంటే, వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తున్న తరుణంలో, బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమావేశం కానుంది.
మరోవైపు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలంతా రేపు సభకు హాజరు కావాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీనికోసం బిజెపి తమ సభ్యులకు విప్ జారీ చేసింది. ఇక వక్ఫ్ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వక్ఫ్ బిల్లుపై చర్చించారు. దీంట్లో 14 సవరణల్ని ప్రవేశపెట్టారు. రేపు మధ్యాహ్నం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. లోక్‌సభలో 8 గంటల పాటు చర్చించనున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపనున్నారు.
పార్లమెంట్‌లో బలాబలాలు..
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు పాస్ అవుతుందా..? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే, పార్లమెంట్‌లోని రెండు సభల్లో అధికార ఎన్డీయేకే బలం ఉంది. బిల్లు సులువుగా పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు 298 మంది ఎంపీల మద్దతు ఉంది, వ్యతిరేకంగా 233 మంది ఉన్నారు. తటస్థంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 122 మంది ఎన్డీయే సభ్యుల మద్దతు ఉండగా, వ్యతిరేకంగా ఇండీ కూటమికి చెందిన 116 మంది ఎంపీలు ఉన్నారు. ఎలా చూసినా, కూడా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం తప్పితే, బిల్లును అడ్డుకునే అవకాశమే కనిపించడం లేదు.